నా లోని "నేను" - 25 [గుర్తింపు]
19.8.2023 సాయంత్రం, తిరుపతి బాలాజీ కల్యాణమండపం లో
మా ex కోలీగు సుబ్రమణ్యం రెడ్డిగారి కూతురి పెండ్లికి అటెండ్ అయ్యాను.
అక్కడికి చాలామంది పాత బ్యాంకు మిత్రులు వచ్చారు.
కొందరైతే మూడు లేదా నాలుగు సంవత్సరాల తరువాత కలిశారు.
అంతమందిని ఒక్కసారిగా చూడటం, వారితో మాట్లాడటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
అందులో ఒకరన్నారు, "నసీర్ భయ్యా, మిమ్ములను వెయ్యి మందిలో ఉన్నా గుర్తుపట్టొచ్చు" అని.
ఇది బహుశా, నా తలమీద ఉన్న టోపీ, నేను ధరించే జుబ్బా & పైజామా వల్ల అయివుండచ్చు.
కొందరు మిత్రులు, నా వలన బ్యాంకులో పనిచేస్తున్న టెంపోరరీ ఎంప్లాయిస్ కు మేలు జరిగింది అని అన్నారు.
కొందరు, నా బ్లాగుపోస్టు లను రెగ్యులర్ గా చదువుతున్నామని, అవి బాగున్నాయని అన్నారు.
ఆలోచిస్తూఉంటే, నాకు ఈ గుర్తింపు మీద ఉండాల్సిన దానికన్నా, కాస్త ఎక్కువ "ఆసక్తి" ఉందేమో అనిపిస్తోంది. అందుకే ఇలా విభిన్నమైన దుస్తులను ధరిస్తూ,, "బ్లాగ్" ద్వారా, నా ఆలోచనలను పంచుకొంటూ, అందరికీ గుర్తుండాలని ప్రవర్తిస్తున్నానేమో!!
అయితే, బాహ్య వేషధారణ వల్ల వచ్చే గుర్తింపు కన్నా, మన నిజ వ్యక్తిత్వం వల్ల, మనం చేసే పనుల వల్ల వచ్చే గుర్తింపు, మనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది.
మనం "మంచి" వారి గా, ఇతరుల నుంచి హృదయపూర్వక గుర్తింపు పొందాలంటే, మనలోపల ఈ క్రింది వాటిని అలవరచుకునేందుకు కృషి చెయ్యాలి.
- సహాయకారిగా ఉండటం: ఇతరులు అడిగినా, అడగక పోయినా, మనం సహాయం చెయ్యటానికి "సిద్ధంగా" ఉండటం.
- నమ్మదగినవారుగా ఉండటం: మనం ఏమి చేయగలమో, ఏమి చేయలేమో క్లియర్ గా మనము తెలుసుకొని, దానిని ఇతరులకు చెప్పి, చెప్పిన దానిని "తప్పకుండా" చెయ్యటం.
- సానుకూలంగా ఉండటం: సానుకూల వైఖరిని కలిగి ఉండి, బాధలలో ఉన్నవారిని, ఇతరులను మాటలతో, చేతలతో "ఉత్తేజపరుస్తూ" ఉండటం.
- క్షమించటం: అందరూ తప్పులు చేస్తారు. దాంట్లో మనమూ ఉంటాము. కాబట్టి మనల్ని మనం, ఇతరులను కుడా "క్షమించటానికి" సిద్ధంగా ఉండటం.
- కరుణతో ఉండటం: ఇతరుల స్థానంలో ఉండటానికి, మరియు వారి అవసరాలను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించటం.
- సమయాన్ని ఇవ్వటం: ఇతరులతో సమయం గడపటానికి, మరియు వారి గురించి తెలుసుకోవటానికి సిద్ధంగా ఉండటం.
- సహృదయులుగా ఉండటం: ఇతరుల భావోద్వేగాలను అర్ధం చేసుకోవడం మరియు వాటికి అనుగుణంగా ప్రతిస్పందించడం.
- మార్పుకు సిద్ధంగా ఉండటం: మన అభిప్రాయాలను మరియు నమ్మకాలను, అవి "తప్పు" అని రుజువు అయితే, మార్చుకోవటానికి సిద్ధం గా ఉండటం.
- సమాజానికి తిరిగి ఇవ్వటం: మన సమయం, నైపుణ్యాలను, సంపదను, మనం ఇవ్వగలిగే విధంగా సమాజానికి తిరిగి ఇవ్వటం.
మన స్వభావంలో పైవి ఇముడ్చుకొని, వాటిని ఆచరిస్తూ ఉంటే, గుర్తింపు అనేది, దానంతట అదే వస్తుంది.
ఏమంటారు??
మీ ప్రియమిత్రుడు,
అబ్దుల్ నసీర్.
94911 35998

Comments